లోకేష్ పాదయాత్ర ప్లెక్సీల వివాదం... మంగళగిరిలో ఉద్రిక్తత

Aug 14, 2023, 5:38 PM IST

గుంటూరు : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్లెక్సీల ఏర్పాటు మంగళగిరిలో  ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. త్వరలోనే ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరికి పాదయాత్ర చేరుకోనున్న నేపథ్యంలో టిడిపి నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ లో టిడిపి శ్రేణులు ప్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయానికి చేరుకున్న టిడిపి నాయకులు కమీషనర్ శారదాదేవిని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ వారిని కలిసేందుకు కమీషనర్ అనుమతించకపోవడంతో టిడిపి నాయకులు, కార్యకర్తలు అక్కడే ఆందోళనకు దిగారు.  నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగిన టిడిపి నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కమీషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.