Nov 9, 2022, 10:22 AM IST
చిత్తూరు : తన సమస్యకు అధికారులు పరిష్కారం చూపకపోవడంతో మాజీ సర్పంచ్ సచివాలయం గుమ్మానికే ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. సచివాలయ అధికారులు అతడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం చెంగుబళ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టిడిపి నేత గోపాల్ తర పొలానికి దారి సమస్యను పరిష్కరించాలంటూ కొంతకాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. మండల రెవెన్యూ అధికారులు, ఆర్డివో, చివరకు స్పందన కార్యక్రమంలో కలెక్టరేట్ వరకు వెళ్లిన అతడి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఆందోళనకు దిగిన మాజీ సర్పంచ్ శాంతిపురం మండల సచివాలయం గుమ్మానికి ఉరితాడు కట్టి ఆత్మహత్యకు యత్నించాడు. సచివాలయ అధికారులు అతన్ని అడ్డుకున్నారు.