Apr 13, 2022, 1:18 PM IST
చైత్రశుద్ద ఏకాదశిని పురస్కరించుకుని విశాఖ జిల్ల సింహాచలంలో కొలువుదీరిన శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. సింహగిరిపై ఉన్న నృసింహ కల్యాణ మండపంలో భారీ ఎత్తున వేదిక ఏర్పాటుచేసి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైదికులు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలకరించి వేదికపై అధిష్టింపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో ఘనంగా జరిపారు.భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు...అంతకుముందు సాయంత్రం నాలుగు గంటల నుంచి కొట్నాల ఉత్సవం, ధ్వజారోహణం, ఎదురు సన్నాహోత్సవం నిర్వహించారు. ఏర్పాటు రాత్రి 7:30 నుంచి సింహగిరి మాడ వీధుల్లో రథోత్సవాన్నినిర్వహించారు. రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.