విశాఖలో రాజస్థానీ ముఠా నయా మోసాలు... బ్యాంక్ ఏటిఎంలు లూఠీ

Dec 14, 2022, 12:09 PM IST

విశాఖపట్నం : గ్రామాల్లోని ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బ్యాంకుల్లో నయా దోపిడీకి పాడుతున్న రాజస్థానీ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ది కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఏటిఎంలలో తొమ్మిది లక్షల పది వేల రూపాయలను ఈ ముఠా చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి  నుంచి ఆరులక్షల నగదు, 78 ఏటిఎమ్ కార్డులు, ఒక ద్విచక్ర వాహనం, ఆరు ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.  రాజస్థానీ ముఠా విశాఖ జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా భారీ మోసాలకు తెరతీసారు. అమాయకులను నమ్మించి వారిపేరిట ది కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లో అకౌంట్  ఓపెన్ చేయించి ఆ ఏటిఎమ్ కార్డుల సాయంతో చోరీకి పాల్పడ్డారు. ఇలా అనకాపల్లి, విశాఖలోని కనకమహాలక్ష్మి బ్యాంక్ ఎటిఎంలలో పదిలక్షల వరకు దోచుకున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే కేసును చేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రాజస్థానీ ముఠాలో ప్రధాన నిందితుడు షారుక్ పరారీలో ఉన్నట్లు విశాఖ సిపి శ్రీకాంత్ వెల్లడించారు.