Apr 19, 2023, 4:29 PM IST
కృష్ణాజిల్లా మచిలీపట్నం ఆర్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ కేసు విషయంలో మాట్లాడేందుకు వచ్చిన తన పట్ల తాలుకా ఎస్ఐ చాణిక్య అవమానకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పెడన కాకర్లమూడి గ్రామ దళిత సర్పంచ్ కామేశ్వరరావు ఆర్ పేట స్టేషన్ ఎదుట గ్రామస్థులతో కలిసి బైఠాయించారు. ఎస్ఐ చాణిక్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ వివాదంపై సీఐ రవికుమార్ మీడియాకు వివరణ ఇచ్చారు. కాకర్లమూడి గ్రామానికి చెందిన మైనర్ బాలికను అల్లరి చేస్తున్నాడనే కారణంతో బలరామునిపేటకు చెందిన ఓ యువకుడిని సర్పంచ్ మంగినపూడి బీచ్ వద్ద చెట్టుకు కట్టి కొట్టాడని.. ఈ కేసులో సర్పంచ్ పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నోటీసులు ఇచ్చే విషయంలో సర్పంచ్ తమ ఎస్ఐతో వాగ్వివాదానికి దిగి చట్టవ్యతిరేకంగా వ్యవహరించాడన్నారు. సర్పంచ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.