Jul 19, 2022, 7:00 PM IST
అమరావతి : భారత నూతన రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా నిన్న (సోమవారం) అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పార్లమెంట్ లో ఎంపీలు, ఏ రాష్ట్రానికి చెందిన అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఓటుహక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రాల్లోంచి ఎమ్మెల్యేల ఓట్లు నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్సులను ఇవాళ (మంగళవారం) ఈసీ అధికారులు డిల్లీకి తరలిస్తున్నారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నుండి కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సును గన్నవరం విమానాశ్రాయానికి తరలించారు. రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ మార్షల్ థియో ఫిలాస్ నేతృత్వంలో బ్యాలెట్ బాక్స్ తరలింపు జరిగింది. గన్నవరం నుండి ఎయిర్ ఇండియా విమానంలో డిల్లీకి తరలించారు. ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్ భారతితో పాటు రాష్ట్రపతి ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కె.రాజ్ కుమార్, వనితారాణి తదితరులు ఈ సీల్డు బ్యాలెట్ బాక్సును తీసుకుని డిల్లీ వెళ్లారు.