Nov 12, 2022, 11:50 AM IST
విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళనలు మరింత పెరిగాయి. ఉక్కు పరిశ్రమలో పనిచేసే కార్మికులతో పాటు ప్రజా సంఘాల జేఏసీ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ''స్టాప్ స్టీల్ ప్లాంట్ సేల్... ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ఆపండి'' అంటూ బ్యానర్లు ప్రదర్శింస్తూ ఆందోళనకారులు రోడ్డెక్కారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభ ప్రాంగణంవైపు వెళుతున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లడానికి నిరసనకారులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక విభజన చట్టాలను అమలు చేయాలంటూ సిపిఐ మహిళా నాయకులు ఆందోళన చేపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమన నిధుల వెంటనే విడుదల చేయాలంటూ ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ మహిళలు ఆందోళన చేపట్టారు. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.