Aug 2, 2022, 4:13 PM IST
భారతదేశ కీర్తిపతకమైన మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రముఖ తెలుగునటుడు బళ్లారి రాఘవ జయంతిని కూడా విశాఖలో నిర్వహించారు. ఇవాళ (మంగళవారం) ఉదయం వీరి జయంతి సందర్భంగా విశాఖ రామకృష్ణ బీచ్ లో జాతీయ జెండాలు చేతపట్టి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని విశాఖ మేయర్ గొలగాని హరీ వెంకట కుమారి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ షా, పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించడమే కాదు జాతీయ జెండా చేతపట్టి పాల్గొన్నారు. అనంతరం వెంకయ్య, బళ్లారి రాఘన ఫోటోలకు పూలమల వేసి నివాళి అర్పించారు.
ఇక అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య ప్రతి భారతీయుడు స్మరించుకునేలా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పింగళి వెంకయ్య జయంతి అయిన ఇవాళ్టి (ఆగస్ట్ 2) నుండి స్వాతంత్ర్య దినోత్సవం వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు దేశప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.