May 8, 2022, 12:59 PM IST
గుంటూరు: టీడీపీ కార్యకర్త పై అధికార వైసిపి శ్రేణులు పట్టపగలే నడిరోడ్డుపైనే హత్యాయత్నానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలం ఆలవల వద్ద టిడిపి కార్యకర్త కాకాని ఏసురాజుపై వైసీపీ ఎంపీపీ గడ్డం వెంకట్రావు వర్గం దాడికి పాల్పడింది. పనికి వెళ్తున్న ఏసురాజును రోడ్డుపై అడ్డగించి కళ్లల్లో కారం కొట్టి రాళ్లతో, రాడ్లతో అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఏసురాజును నరసరావుపేటలో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్దితి విషమంగా వుంది.
ఈ దారుణంపై సమాచారం అందినవెంటనే నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు ఏసురాజును పరామర్శించారు. అతడి కుటుంబసభ్యులను అడిగి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు వైసిపి తోత్తులుగా పని చేస్తున్నారని... రొంపిచర్ల ఎస్సై కావాలనే వైసిపి వారితో ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారని చదలవాడ ఆరోపించారు.