Andhra News: తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి కార్మికుల యత్నం... ఉద్రిక్తత

Apr 18, 2022, 3:58 PM IST

తాడేపల్లి: తమకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కార్మికులు ఆందోళనకు దిగారు. సిఐటియూ ఆధ్వర్యంలో కార్మికులంతా కలిసి మున్సిపల్ కార్యాలయ ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత 5 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ అలవెన్సులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. 8 నెలలుగా కనీసం కార్మికులకు కొబ్బరి నూనె, సబ్బులు ఇవ్వకపోవటం దారుణమని... ఇవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో తాడేపల్లి మునిసిపాలిటీ ఉందా? అని నిలదీసారు. కరోనా టైంలో తీసుకున్న మునిసిపల్ కార్మికులను జీతాలు ఇవ్వకుండానే తొలగించి కొత్త వారిని పనులలోకి తీసుకోవటం దుర్మార్గం... తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మునిసిపల్ కార్మికుల వెంటనే న్యాయం చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేసారు.