Nov 22, 2022, 10:23 AM IST
పల్నాడు : తల్లి పొత్తిళ్లలో బోసినవ్వులతో ఆడుకోవాల్సిన పసిగుడ్డు బకెట్ లో శవమై తేలిన అమానుష ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. మాచర్లకు చెందిన ఓ యువతి తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ ఇంట్లో వుంటోంది. అయితే గతకొంతకాలంగా యువతి బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యింది. నిన్న(సోమవారం) సాయంత్రం మురికి కాలువలో ఎర్రగా రక్తం ప్రవహించడంతో అనుమానించిన స్థానికులు యువతి అమ్మమ్మతో కలిసి నివాసముంటున్న ఇంట్లోకి వెళ్లిచూడగా దారుణ దృశ్యం కనిపించింది. ఓ బకెట్లో అప్పుడే పుట్టిన నవజాత శిశువును చూసి స్థానికులు కంగుతిన్నారు. పెళ్లి కాకుండానే యువతి గర్భందాల్చి వుంటుందని... ఈ విషయం బయటపడకుండా వుండేందుకే అమ్మమ్మతో కలిసి కన్నతల్లే చిన్నారిని చంపివుంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు మృత శిశువును హాస్పిటల్ కు తరలించారు. అలాగే యువతిని కూడా మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.