తిరుపతి, విశాఖ జూపార్క్ ల అభివృద్దికి చర్యలు...: అటవీ అధికారులకు మంత్రి ఆదేశాలు

Dec 14, 2022, 3:39 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో జూపార్క్ లను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని అటవీశాఖ అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బుధవారం అటవీశాఖపై మంత్రి సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సందర్శకులను మరింతగా ఆకర్షించేలా తిరుపతి, విశాఖ జూపార్క్ లను తీర్చిదిద్దాలని... దేశంలోని పలు జంతుసందర్శన శాలల్లో అదనంగా ఉన్న జంతువులను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ అధికారలకు మంత్రి పెద్దిరెడ్డి సూచించారు.   

ఇక ఎర్రచందనం మెక్కలను అటవీశాఖ నర్సరీల ద్వారా  రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. తిరుపతిలోని బయోట్రిమ్ ద్వారా ఎర్రచందనంపై పరిశోధనలు చేసి, మేలుజాతి మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రైతుల నుంచి ఎర్రచందనంపై డిమాండ్ ఎక్కువగా ఉంది... కాబట్టి అటవీశాఖ నర్సరీల ద్వారా అందుబాటు ధరలోనే ఎర్రచందనం మొక్కలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి అటవీ అధికారులకు సూచించారు.