Nov 25, 2022, 4:33 PM IST
గన్నవరం : అమాయకులను టార్గెట్ గా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న కేటుగాన్ని బాధిత మహిళ తెలివిగా పోలీసులకు పట్టించింది. నకిలీ సబ్ కలెక్టర్ అవతారమెత్తి జాదూగాడు సుమారు 70 నుండి 80 లక్షలు వసూలుచేసాడు. ఇలాగే ఓ మహిళ నుండి కూడా రూ.10 లక్షల వరకు వసూలు చేయగా మోసపోయానని గ్రహించిన ఆమె చాకచక్యంగా వ్యవహరించి కేటుగాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది.
విజయవాడ చిట్టీనగర్ కు చెందిన పిల్లా వెంకట రాజేంద్ర గతంలో సిఆర్డిఏ లో కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తూ అవినీతికి పాల్పడి ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటినుండి మోసాలబాట పట్టిన అతడు సబ్ కలెక్టర్ అవతారమెత్తాడు. ఇలా నకిలీ ఐడీ కార్డులో తిరుమలకు వెళ్లిన సమయంలో తిరుపతికి చెందిన మహిళను పరిచయం చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత మహిళలకు ప్రభుత్వ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి పదిలక్షల వరకు వసూలుచేసాడు. ఆమె బంధువుల నుండికూడా డబ్బులు వసూలు చేసాడు. అతడి మోసాన్ని గుర్తించిన మహిళ తెలివిగా వ్యవహరించింది. డబ్బులిస్తానని నమ్మించి గన్నవరంకు పిలిపించి పోలీసులకు అప్పగించింది.