Jun 15, 2022, 11:04 AM IST
గుంటూరు: తాడికొండ మండలం కంతేరులో దళిత మహిళ వెంకాయమ్మ కుటుంబంపై దాడిచేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్లపు సునీత (బుజ్జి) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కంతేరు ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి సిద్దపడ్డారు. తన కుమార్తె పరువు బజారున పడేలా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ... వెంకాయమ్మతో వ్యక్తిగత గొడవను రాజకీయం చేస్తున్నారంటూ సునీత ఆరోపించారు. వెంకాయమ్మ కొడుకు కర్లపూడి వంశీ తన కూతురిపై అనుచిత వ్యాఖ్యలు చేసాడని... దీంతో అతడి కుటుంబంతో తాము గొడవపడినట్లు సునీత తెలిపారు. కానీ టిడిపి పార్టీ నాయకులు దీన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని బాధిత మహిళ ఆరోపించింది. ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సునీత ప్రస్తుతం మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని... ప్రస్తుతానికి ఆమె పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు డాక్టర్లు తెలిపారు.