జనసేన టార్గెట్ గా ఏపీలో అల్లర్లు... వైసిపి భారీ కుట్ర : పోతిన మహేష్ సంచల

Oct 23, 2022, 12:55 PM IST

విజయవాడ : ఇంటలిజెన్స్ రిపోర్ట్ పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మరొక అరాచకం సృష్టించాలని చూస్తోందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి విద్వేషాలను రగిల్చడంలో, శాంతిభద్రలకు భంగం కలిగించడంలో వైసిపి నాయకులు దిట్ట అన్నారు. ఇంటలిజెన్స్ రిపోర్ట్ పేరుతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అరాచకాలు,  అల్లర్లకు వైసిపి ప్లాన్ చేస్తోందన్నారు. జనసేన పార్టీ జెండాలతో వైసిపి అల్లరి మూకలు గొడవలు, అల్లర్లు స‌ృష్టించాలని చూస్తున్నాయని... తద్వారా జనసేన నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులకు కుట్ర చేస్తోందని మహేష్ తెలిపారు. 

ఇంటలిజెన్స్ వ్యవస్థ ప్రజల డబ్బులతో  ప్రభుత్వం కోసం పనిచేస్తుంది... కానీ ఈ పాలనతో తాడేపల్లి డైరెక్షన్లో పనిచేస్తోందని పోతిన మహేష్ పేర్కొన్నారు. గతంలో అమలాపురం ఘటనలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని గుర్తుచేసారు. ఇటీవల వైజాగ్ లో వాళ్లే కొట్టుకొని జనసేన పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారన్నారు. ఇలా జనసేన పార్టీ టార్గెట్ గా విద్వేషాలు రెచ్చగొట్టి అశాంతికి ప్రయత్నిస్తున్నారన్నారు. వీటన్నింటిని పవన్ కల్యాణ్ గమనిస్తున్నారని... వీరి కవ్వింపులను ఎదుర్కొనే వ్యూహాలతోనే ముందుకు వెళుతారని పోతిన మహేష్ పేర్కొన్నారు.