Mar 15, 2022, 12:03 PM IST
జంగారెడ్డిగూడెం: నాటుసారా వల్లే తన కొడుకు చనిపోయాడని జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ బాధిత తల్లి టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించింది. కొడుకు మృతితో తనతో పాటు కోడలు, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డామని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం టిడిపి అధ్యక్షులు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన కొడుకు నాటుసారా వల్ల చనిపోలేదని చెప్పమని వైసీపీ నాయకులు బెదిరించారని తెలిపింది. చంద్రబాబు చెప్పేదంతా సొల్లేనని... ఆయనను కలవొద్దని బెదిరించారని తెలిపారు. ఏలూరు కలెక్టర్ ఆఫీసులో డబ్బులు ఇస్తాం రమ్మంటూ బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని బాధితురాలు తెలిపింది. వారి మాట విననందుకు వైసీపీ నాయకులు ఏమైనా చేస్తారని భయంగా వుందన్నారు బాధిత మహిళ. అయినా సారాతాగి తన కొడుకులాగే ఇంకెవ్వరూ చనిపోకుండా ప్రభుత్వం చూడాలనే తాను ధైర్యంచేసి మాట్లాడుతున్నట్లు బాధిత తల్లి తెలిపింది.