Oct 26, 2022, 1:20 PM IST
ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట ఆటోనగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు మోటార్ సైకిళ్లపై అనుమనాస్పదంగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో వారు ముగ్గురూ కలిసి మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసి, అమ్మి జల్సాలు చేస్తారని తేలింది. విచారణలో వారు ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో 11 మోటార్ సైకిళ్ళు, ప్రకాశం జిల్లాలో 11 మోటార్ సైకిళ్ళు, గుంటూరు జిల్లాలో 15 మోటార్ సైకిళ్ళు, తెలంగాణలో 3 మోటార్ సైకిళ్ళు మొత్తం 40 వాహనాలు దొంగతనం చేసినట్లు తేలింది. వాటిలో 19 వాహనాలను కే.అగ్రహారం అట్టల ఫ్యాక్టరీలో దాచినట్లు, గుంటూరు జిల్లా నరసరావుపేట చెందిన కొమ్మిశెట్టి కోటేశ్వర రావుకు 20 మోటార్ సైకిళ్ళు అమ్మినట్లు నేరం అంగీకరించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం 40 మోటార్ సైకిళ్ళ విలువ సుమారు 25 లక్షలు రూపాయిల వరకు ఉంటుందని అంచనా.