Apr 22, 2022, 5:33 PM IST
విజయవాడ: మానసిక దివ్యాంగురాలిపై ఏకంగా ప్రభుత్వాస్పత్రిలో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ప్రస్తుతం విజయవాడ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధిత బాలికను హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. ఈ సందర్భంగా బాలిక ఆరోగ్యపరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెక్ ను బాధిత యువతి తల్లిదండ్రులకు అందించారు హోం మినిస్టర్. బాధిత కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని హోంమంత్రి భరోసా ఇచ్చారు.
కేవలం నష్టపరిహారమే కాదు అర్హతను బట్టి బాధిత యువతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు వచ్చేలా చూస్తామన్న హోంమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే అత్యాచార ఘటనలో నిర్లక్ష్యంగా వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందేలా చూడలాని ఆసుపత్రి అధికారులను మంత్రి వనిత ఆదేశించారు. హోంమంత్రితో పాటు ఇతర మంత్రులు
విడదల రజిని, జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్, సీపీ, ఇతర అధికారులు బాధిత యువతిని పరామర్శించారు.