Dec 26, 2022, 12:31 PM IST
గుడివాడ : వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ కు దారితీసింది. నిన్న(ఆదివారం) వైసిపి, టిడిపి శ్రేణులు ఘర్షణ... మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావుకు వైసిపి నేతల బెదిరింపుల నేపథ్యంలో గుడివాడ ఒక్కసారిగా వేడెక్కింది. అధికార వైసిపి నాయకుల బెదిరింపులతో వెనక్కి తగ్గబోమని... ఎట్టి పరిస్థితుల్లో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని జరిపి తీరతామని టిడిపి నాయకులు చెబుతున్నారు. అయితే రంగా వర్ధంతిలో కార్యక్రమంలో పాల్గొంటే చంపేస్తానంటూ రావి వెంకటేశ్వరరావును వైసిపి నేత మెరుగు మాల కాళీ ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో ఇవాళ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా గుడివాడ టిడిపి కార్యాలయం, పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భారీగా పోలీసులను మొహరించారు.
ఆదివారం వైసిపి, టిడిపి శ్రేణుల పరస్పర దాడులతో గుడివాడ అట్టుడికింది. కర్రలతో రోడ్లపైకి వచ్చి పరస్పర దాడులు, పెట్రోల్ నింపిన కవర్లను రోడ్లపై విసిరి నానా హంగామా సృష్టించారు. దీంతో ఇరువర్గాలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఇలా నిన్నటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.