Sep 11, 2023, 3:27 PM IST
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో గత రాత్రి కురుస్తున్న కుండపోత వర్షం ప్రమాదాలు సృష్టిస్తోంది. ఇవాళ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ వెలిసిన ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లే ఘాటు రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరక్కున్నా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అమ్మవారి దర్శనంకోసం వచ్చిన భక్తులు ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇక విజయవాడ నగరంలోని రోడ్లు వర్షపునీటితో చెరువులను తలపిస్తున్నాయి. బస్టాండ్ వద్ద నడుం లోతులో నీరు నిలవడంతో రెండు లారీలు, నాలుగు బస్సులు అందులో చిక్కుకున్నాయి. దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. భారీ క్రేన్ల సాయంతో వాహనాలను బయటకు తీయించి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ కూడా వరద నీటిలో చిక్కుకుంది.