Aug 7, 2022, 12:36 PM IST
కేవలం సైకిల్ పైనుండి కిందపడి బాలిక మృతిచెందిన విషాద ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. చల్లపల్లి నారాయణరావు నగర్ కు చెందిన రాపూరి శ్రీనివాసరావు-వెంకాయమ్మ దంపతుల నాలుగో కూతురు నాగప్రసన్న పదో తరగతి చదువుతోంది. అయితే స్థానిక రైతుబజార్లో పనిచేసే అక్కను తన సైకిల్ పై దింపడానికి వెళుతుండగా అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో నాగప్రసన్న తల నేలకు బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్ కు వెళ్లాలని సూచించారు. దీంతో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో నాగప్రసన్న మృతిచెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.