Nov 21, 2022, 11:42 AM IST
గన్నవరం : దళిత మహిళనైన తనపై సొంతపార్టీ నాయకులే కుట్రలు పన్నుతున్నారని ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య ఆందోళన వ్యక్తం చేసారు. దళితురాలినైన తాను సర్పంచ్ గా వుండటం ఇష్టంలేని మాజీ ఆర్మీ ఉద్యోగి ముప్పనేని రవి ఉపసర్పంచ్ పాలడుగు నాని, మరికొందరు నాయకుల సహకారంతో మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడని అన్నారు. తనను కులం పేరుతో దూషించడం, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని తెలిపారు. చివరకు తన పర్సనల్ విషయాలను రాజకీయం చేస్తున్నారని... చీర కట్టుకుందని, పూలు పెట్టుకుందని చివరకు తాగే కప్పుగురించి మాట్లాడుతున్నారని అన్నారు. వీరి వల్ల తనకు, కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని సర్పంచ్ సౌజన్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే గన్నవరం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చెయ్యగా రవికుమార్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారని మహిళా సర్పంచ్ తెలిపారు.