Nov 29, 2022, 5:05 PM IST
తిరుపతి : అభం శుభం తెలియని స్కూల్ చిన్నారులే టార్గెట్ గా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. చంద్రగిరిలోని ఓ గర్ల్స్ హైస్కూల్ వద్దగల టీస్టాల్ లో సిగరెట్ లో గంజాయి పెట్టి విక్రయిస్తున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఓ టెన్త్ క్లాస్ విద్యార్థిని ఇదే టీ స్టాల్ గంజాయి నింపిన సిగరెట్ తాగుతూ పట్టుబడగా అమ్మాయిలకు సిగరెట్ ఎలా అమ్ముతారని ప్రశ్నించిన బాధిత తల్లిపైనే టీ స్టాల్ నిర్వహకులు దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. మంగళవారం మిగతా విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
అయితే స్కూల్ బయట జరిగిన ఘటనతో తమకు ఏం సంబంధమని స్కూల్ హెడ్ మాస్టర్ ప్రశ్నిస్తున్నారు. స్కూల్ ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగిందని స్కూల్ హెడ్ మాస్టర్ చెబుతున్నారు. స్కూల్ కి సమీపంలోని టీ స్టాల్స్ సహా ఇతర పదార్ధాలు విక్రయించేవారిని తొలగించాలని కోరుతామన్నారు.ఈ దుకాణాల్లో విద్యార్ధులకు మత్తుపదార్ధాలు ఏమైనా విక్రయిస్తున్నారా అనే కోణంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్కూల్ హెడ్ మాస్టర్ మీడియాకు చెప్పారు.