గడపగడపకు కార్యక్రమంలో వైసిపి ఎమ్మెల్యేకు చేదు అనుభవం... ఆ హామీలపై నిలదీసిన టిడిపి

Aug 24, 2022, 11:11 AM IST


ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అధికార వైసిపి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ముసునూరు మండలం గుడిపాడు గ్రామంలో పర్యటిస్తుండగ టిడిపి నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, చింతలపూడి ఎత్తిపోతల పథకం హామీలు ఏమయ్యాయంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ టిడిపి శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మధ్యపాన నిషేధం హమీని మరిచి ఇప్పుడు జగన్ బ్రాండ్లతో ప్రజలను దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రజాసమస్యలను పరిస్కరించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేసారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించేందుకు టిడిపి నేతలు గద్దె రఘు, మాజీ ఎంపీపీ కొల్లి రాజ ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు టిడిపి నాయకులను అక్కడినుండి పంపించారు.