ఆటోనగర్ లో భారీ అగ్నిప్రమాదం... డీజిల్ ట్యాంకులు పేలి భారీ శబ్దాలు, వాహనాలు దగ్దం

Jun 1, 2022, 2:39 PM IST

గుంటూరు పట్టణంలోని ఆటోనగర్ ఫేజ్ 1లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాత వాహనాలు మరమ్మతులు చేసే దుకాణాల సముదాయంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన మంటలు అంతకంతకు చెలరేగి ఆ సముదాయమంతా వ్యాపించాయి. దీంతో పాత వాహనాలు, వాటి విడిభాగాలు, డిజిల్ డబ్బాలు, యంత్ర పరికరాలు కాలిబూడిదయ్యాయి. లక్షల రూపాయిల విలువైన  ఆటోమొబైల్ పరికరాలు దగ్దమయ్యాయి. లారీలు, కార్లలో వుండే డీజిల్ ట్యాంకులు పేలి భారీశబ్దాలతో మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.  అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.