Nov 11, 2022, 10:07 AM IST
అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామ సమీపంలో బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు చెలరేగి భారీ పేలుళ్లకు దారితీసాయి. బాణాసంచా తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలు భారీగా వుండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ పేలుళ్ళ దాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కంపించిందంటే పరిస్థితి ఎంతదారుణంగా వుందో అర్థమవుతుంది. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.10లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక ఇప్పటికే పేలుళ్లు సంభవించిన ప్రాంతాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు.