Aug 4, 2022, 10:57 AM IST
నరసరావుపేట : పోకిరీలు వేదిస్తుంటే సామాన్య మహిళలు, అమ్మాయిలు పోలీసులను ఆశ్రయిస్తుంటారు. అలాంటిది పోలీసే ఆకతాయిల వేధింపులకు గురయిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది. తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయిల నుండి కాపాడాలంటూ ఓ మహిళా కానిస్టేబుల్ చిన్నారి, తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది. నరసరావుపేట మండలం యల్లమందకు చెందిన హసీనా పోలీస్ కానిస్టేబుల్. తల్లిదండ్రులతో కలిసి వుంటున్న ఆమెను అదే గ్రామానికి చెందిన స్వర్ణ శరత్, స్వర్ణ మల్లికార్జునరావు వేధిస్తున్నారు. మద్యం మత్తులో వీరిద్దరూ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధిత పోలీస్ ఆరోపిస్తున్నారు. వీరిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా సచివాలయ సిబ్బంది కొందరు ఈ ఆకతాయిలకు మద్దతివ్వడంతో చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు తెలిపింది. దీంతో మరింత రెచ్చిపోయిన మల్లికార్జునరావు మరోసారి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా కానిస్టేబుల్ తెలిపారు. దీంతో సచివాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి హసీనా ఆందోళనకు దిగింది.