లైసెన్స్ లేకుండానే మెడికల్ షాప్... ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపి డాక్టర్ చెలగాటం

Jun 7, 2022, 1:01 PM IST

విజయవాడ: తొండ ముదిరి ఊసరవెల్లి అయిందన్నట్లు ఆర్ఎంపీ డాక్టర్ కాస్త మెడికల్ షాప్ ఓనరయ్యాడు. చిన్నచిన్న రోగాలను వైద్యం చేయాల్సినవాడు ఏకంగా మెడికల్ షాపే పెట్టేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. సదరు మెడికల్ షాప్ పై  ఔషధ నియంత్రణ అధికారులు దాడి చేయడంతో ఆర్ఎంపి బాగోతం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఓ ఆర్ఎంపి వైద్యుడు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధలకు విరుద్దంగా మెడికల్ షాప్ నడిపిస్తున్నాడు. దీనిపై ఫిర్యాదులు అందడంతో జిల్లా ఔషధ నియంత్రణ విభాగం ఏడి అనిల్ కుమార్, నందిగామ, గుడివాడ డ్రగ్ ఇన్స్పెక్టర్లు సురేష్ కుమార్, బాలు ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న సుమారు లక్ష రూపాయల విలువైన 98 రకాల మందులు, శాంపిల్స్ లను స్వాధీనం చేసుకున్నారు. గత మూడేళ్లుగా ఎలాంటి లైసెన్స్ లేకుండా ఆర్ఎంపి మెడికల్ షాప్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. సదరు ఆర్ఎంపిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.