నా నియామకంతో ఎమ్మెల్యే శ్రీదేవి బాధలో వున్నమాట నిజమే..: డొక్కా మాణిక్యవరప్రసాద్

Aug 22, 2022, 4:20 PM IST

గుంటూరు : తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితుడినైన తనకు స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో ఎలాంటి విబేధాలు లేవని... పార్టీ ఆదేశాల మేరకే తాను పనిచేస్తున్నానని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేసారు. సీఎం జగన్ నిర్ణయించిన మేరకే తాడికొండ వైసిపి బాధ్యతలు తనకు దక్కాయని... ఈ అవకాశం కల్పించిన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఎలాంటి వివాద, విభేదాలు లేకుండా అందరితో కలిసి పార్టీని బలోపేతం చేస్తానని... వైసిపిలో గ్రూపు రాజకీయాలకు తావు లేదన్నారు. వైసిపిలో వున్నది ఒక్కటే గ్రూప్.. అది జగన్మోహన్ రెడ్డి గ్రూప్ అని డొక్కా పేర్కొన్నారు. వెంకటపాలెం వెంకటేశ్వర స్వామిని డొక్కా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రకటించే వరకు తాడికొండ సమన్వయకర్తగా తన నియామకం గురించి తెలియదన్నారు. ఎమ్యెల్యే శ్రీదేవి కొంత బాధతో వున్నమాట వాస్తమేనని... ఆమెను కలిసి మాట్లాడతానన్నారు. ఆమెతో కలిసి వైసిపి బలోపేతానికి పనిచేస్తానని తెలిపారు. రాజధాని రైతులు రాజకీయాలకు అతీతంగా ముందుకు వస్తే ఎమ్యెల్యేతో కలిసి వారి సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తానని డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు.