Aug 16, 2022, 10:16 AM IST
ఏలూరు : గుప్తనిధుల కోసం ఇంట్లోని బావిని తలపించేలా భారీగా తవ్వకాలు జరిపిన ఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది. నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి వేదాద్రి శ్రీనివాసరావు తన ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టాడు. గత 10 రోజులుగా తవ్వకాలు జరుపుతూ 15 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతులో పెద్ద బావినే తవ్వేసారు. అర్థరాత్రి తవ్వకాలు జరుపుతూ ఇంటివైపు ఎవరినీ రానివ్వకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు శ్రీనివాసరావు ఇంటిపై దాడిచేయగా భారీగా తవ్వకాలు, క్షుద్రపూజలను గుర్తించారు. దీంతో ఇంటి యజమాని శ్రీనివాసరావుతో పాటు అతడికి సహకరించిన మరో ఐదుగురిని అరెస్ట్ చేసారు. తవ్వకాలు జరిపిన ఐదుగురు కూలీలు పరారీలో వుండగా వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.