టిడిపి ఛలో అనుమర్లపూడి... ధూళిపాళ్లను కాళ్లుచేతులు పట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు

Jun 20, 2022, 2:23 PM IST

గుంటూరు: ఛలో అనుమర్లపూడి నేపథ్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువులో వైసిపి సర్కార్ అండతో ఆ పార్టీ నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ టిడిపి ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో టిడిపి శ్రేణులు అనుమర్లపూడిలోకి రాకుండా చెక్ పోస్ట్ లు పెట్టి అడ్డుకోవడమే కాదు కొందరిని హౌస్ అరెస్ట్ లు చేసారు. అయినప్పటికి పోలీసుల నిర్బంధాలను దాటుకుని ధూళిపాళ్ల అనుమర్లపూడి చెరువువద్దకు చేరుకుని ఆందోళనకు దిగగా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసారు.  ఆయన అరెస్ట్ సమయంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఇలా అదుపులోకి తీసుకున్న దూళిపాళ్లను చింతలపూడిలోని ఆయన స్వగ‌ృహానికి తరలించారు పోలీసులు. తిరిగి ఇంట్లోంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ... అధికార అండతో వైసిపి నాయకులు మరింత బరితెగించారని మండిపడ్డారు. పూర్వకాలంలో దోపిడీకి పాల్పడే టగ్గులు, పిండారీలను సైతం వైసిపి నాయకులు మించిపోయారని అన్నారు. మరీ ముఖ్యంగా పొన్నూరు నియోజవర్గంలో అడుగడుగునా దోపిడీ జరుగుతోందని... ఏకంగా 50-60 మీటర్ల లోతు తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు.