Aug 12, 2022, 1:27 PM IST
కాకినాడ : సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు నిదర్శనమే రాఖీ పండగ. అయితే ఇటీవలే సోదరి మృతితో తీవ్ర మనోవేదకు గురయిన సోదరులు ఆమె లేకుండా రాఖీ పండగ జరుపుకోలేకపోయారు. దీంతో సోదరి నిలువెత్తు శిల్పాన్ని తయారుచేయించి రాఖీ పండగ జరుపుకున్నారు ఆ అపూర్వ సోదరులు. ఇలా సోదరిపై తమకున్న ప్రేమను రాఖీపండగ పూట వినూత్నంగా చాటుకున్నారు కాకినాడ జిల్లాకు చెందిన యువ సోదరులు. కత్తిపూడికి చెందిన శివ, రాజా, వరలక్ష్మి, మణి తోబుట్టువులు. అయితే ఇటీవల ఏడునెలల క్రితం మణి(29) ప్రమాదవశాత్తు మృతిచెందింది. దీంతో ఆమె లేకుండా రాఖీపండగ జరపుకోడానికి మనసొప్పక సోదరులు శివ, రాజా వినూత్నంగా ఆలోచించారు. ముందుగానే సోదరి మణి శిల్పాన్ని తయారుచేయించిన వారు ఇవాళ రాఖీ పండగ పూట ఈ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. అనంతరం ఆ విగ్రహంలోనే సోదరిని చూసుకుని మరో సోదరి వరలక్ష్మితో రాఖీ కట్టించుకున్నారు.