Apr 29, 2022, 4:58 PM IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరెంట్ కోతలు, రోడ్ల పరిస్థితి గురించి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణలో పరిస్థితుల గురించి కామెంట్ చేసారు. రాజధాని హైదరాబాద్ లో కరెంట్ కోతలతో పరిస్థితి అద్వాన్నంగా వుందని... జనరేటర్ వేసుకుని వుండాల్సి వస్తోందన్నారు. కేటీఆర్ కు ఏపీలో పరిస్థితి గురించి ఎవరో చెప్పారు... కానీ తాను హైదరాబాద్ స్వయంగా కరెంట్ కష్టాలను చవిచూసానన్నారు. తాను జనరేటర్ వేసుకుని అక్కడ ఉండి వచ్చానని అన్నారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని... వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బొత్స కోరారు. బాధ్యత కలిగిన వ్యక్తి అలా మాట్లాడటం తగదన్నారు. తమ ఘనత ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు కానీ ఎదుటి వారి గురించి ఇలా మాట్లాడకూడదని కేటీఆర్ ను బొత్స హెచ్చరించారు.