Jul 5, 2022, 11:24 AM IST
గన్నవరం : అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల కోసం సోమవారం ఏపీకి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించి అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రధాని రాకను నిరసిస్తూ గన్నవరం విమానాశ్రయానికి 4కిలోమీటర్ల దూరంలో సూరంపల్లి నుండి కాంగ్రెస్ నాయకులు బెలూన్లు ఎగరవేయగా అవికాస్తా మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు సమీపంగా వెళ్లాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీతో సహా నలుగురు కాంగ్రెస్ నాయకులపై ఐపీసీ 353, 341, 188, 145 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారు. వీరి అరెస్ట్ నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి వరకు హైడ్రామా నడిచింది. చివరకు బెయిల్ లభించడంతో అర్థరాత్రి 2గంటల సమయంలో పద్మశ్రీతో సహా అరెస్టయిన నాయకులందరినీ పోలీసులు విడిచిపెట్టారు.