Jun 7, 2022, 1:53 PM IST
విజయవాడ: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో వున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా తాజాగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న నడ్డాకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నేరుగా గర్భగుడి వద్దకు వెళ్లి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు నడ్డా. అనంతరం ఆలయ ఈవో భ్రమరాంబ శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. వేదపండితులు నడ్డాకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ... ఎప్పటినుంచో దుర్గమ్మ దర్శనానికి వద్దామనుకుంటున్నాని... ఈ భాగ్యం ఈరోజు కలిగిందన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి మహిమ గురించి స్ధానిక నాయకులు చెప్పారన్నారు. అమ్మవారి కృప, కరుణ, కటాక్షాలతో దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దుర్గమ్మ అశీర్వాదంతో మంచి పరిపాలన అందాలని కోరుకుంటున్నానని జేసి నడ్డా అన్నారు.