Jun 3, 2022, 4:31 PM IST
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన పూర్తిగా మోసపూరితమని... రాష్ట్ర ప్రయోజనాలకోసమని చెప్పి సొంత వ్యవహారాలు చక్కదిద్దుకోడానికి వెళ్లారని మాజీ మంత్రి, టిడిపి నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఇప్పటికే సీఎం అనేకసార్లు ప్రధానిని కలిసినా రాష్ట్ర కోసం చేసింది ఏమైనా ఉందా..? పోలవరం, రైల్వేజోన్, రాష్ట్ర లోటుపాట్లు కోసం చర్చించి ఏమైనా సాదించారా...? అని నిలదీసారు. జగన్ బీజేపీ కి దత్తపుత్రుడిగా మారారని మాజీ మంత్రి ఎద్దేవా చేసారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని తన సొంతానికి వాడుతున్నాడని... చరిత్రలో ఇంత దిగజారుడు రాజకీయం ఎప్పుడు చూడలేదన్నారు. కేవలం బాబాయ్ హత్య కేసులో సిబిఐ విచారణ గురించి చర్చించేందుకే ప్రధాని మోదీని సీఎం కలిసారని బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు.