Dec 16, 2022, 11:36 AM IST
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయమున్నా మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు వైసిపి వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం పేరిట వైసిపి ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లే కార్యాక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఇక తాజాగా నియోజకవర్గాల వారిగా వైసిపి శ్రేణులతో సమావేశమవుతూ వారికి దిశానిర్దేశం చేసే కార్యక్రమాన్ని కూడా జగన్ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలతో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ... గత ఎన్నికల రికార్డును బద్దలుకొడుతూ 175 కు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసమే ప్రజల వద్దకు వెళ్లేందుకు వేగంగా అడుగులు వేసేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యాక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మూడేళ్ళకు పైగా సాగిన వైసిపి పాలనలో కేవలం మైలవరం నియోజకవర్గంలోని 89 శాతం ఇళ్లకు నేరుగా రూ.900 కోట్లు వెళ్లాయన్నారు. ఇలా మేలు చేసిన పార్టీని ఆశీర్వదించమని అడిగేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.
జనవరి నుండి బూత్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నామని... రానున్న 16 నెలలు కష్టపడితే మరోసారి మనదే అధికారమని సీఎం జగన్ పేర్కొన్నారు.