ప్రకాశం జిల్లాలో ప్రాచీన నంది విగ్రహం ధ్వంసం... సునీల్ దియోధర్ సీరియస్

Oct 18, 2022, 3:44 PM IST

ప్రకాశం జిల్లా కనపర్తి గ్రామంలో నంది విగ్రహం ధ్వంసంపై బిజెపి ఏపీ ఇంచార్జీ సునీల్ దియోధర్ సీరియస్ అయ్యారు. పవిత్రమైన సోమవారం రోజున దేశమంతా శివారాధనలో మునిగివుండగా ఏపీలో పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన నంది విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసారన్నారు. ప్రాచీన శివాలయంలో ఇలా నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బిజెపి నేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమయ్యాక హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని... ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 200 కు పైగా ఇలాంటి ఘటనలు జరిగినా ఇప్పటివరకు ఒక్క నిందితున్ని కూడా అరెస్ట్ చేయలేదని దియోధర్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయి అనడానికి ఇవే నిదర్శనమన్నారు. దేవాలయాలపై దాడి జరిగినే కొత్త దేవాలయాలు, రథాలు దగ్దమైతే కొత్త రథాలు చేయించడం కాదు... ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని కోరారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దని... తాజా ఘటనపై చర్యలు తీసుకోవాలని... లేదంటే రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఆందోళనలు దిగుతుందని సునీల్ దియోధర్ హెచ్చరించారు.