ఈ రెండ్రోజులూ ఏపీలో భారీ వర్షాలు... ఆరెంజ్ హెచ్చరిక జారీ

Sep 20, 2022, 10:11 AM IST

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండ్రోజులు సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఏపీకి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసారు. ముఖ్యంగా ఈ రెండ్రోజులు  ఉత్తర కోస్తా, తూర్పు గోదావరి , పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. అలాగే తీరంవెంబడి 40-45 నుండి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తూ సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని... కాబట్టి రానున్న మూడురోజులూ మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. వాయువ్య మరియు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో మరింత బలపడనుందని తెలిపారు. దీని ప్రభావంతోనే ఇప్పటికే వర్షాలు మొదలవగా మరో రెండ్రోజులు ఇవి కొనసాగే అవకాశం వుందని వాతావరణ విభాగం ప్రకటించింది.