Mar 12, 2022, 12:22 PM IST
ఆంధ్రప్రదేశ్ (andhra pradesh)లోని కృష్ణా జిల్లాలో (krishna district) దారుణం జరిగింది. ఓ యువకుడు వృద్ధుడి గొంతు కోసి పరారయ్యాడు. అయితే వృద్ధుడికి సరైన టైమ్ లో చికిత్స అందడంతో ప్రస్తుతం ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకోగలిగాడు. ఈ ఘటన గుడివాడ (gudiwada)లోని ఎర్ర బండి సెంటర్ (errabandi center)లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. నిలాపు రాము (nilapu ramu) అనే వృద్ధుడు వంట పని చేసుకుంటూ జీవనం సాగిస్తాడు. శుక్రవారం ఉదయం ఎర్రబడి సెంటర్ లోని ఒక హోటల్ లో టిఫిన్ పార్శిల్ కట్టించుకుంటున్నాడు. ఇదే సమయంలో అటు పక్క నుంచి మణికంఠ (manikanta) అనే యువకుడు బ్లేడు తీసుకొని వచ్చి నిలాపు రాము గొంతుకోసి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో వృద్ధుడికి తీవ్ర రక్త స్రావం జరగడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ (Gudivada government Area Hospital)కు తీసుకెళ్లారు. వెంటనే హాస్పిటల్ లో డాక్టర్లు ట్రీట్ మెంట్ మొదలు పెట్టారు. దీంతో అతడికి ప్రాణపాయ స్థితి తప్పింది. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై గుడివాడ రెండో టౌన్ (Gudivada 2 town police station) పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.