ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం... హాస్పిటల్లో క్షతగాత్రుల హాహాకారాలు, పరిస్థితి విషమం

Apr 14, 2022, 10:51 AM IST

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఘోరం జరిగింది. నిన్న(బుధవారం) రాత్రి పోరస్ రసాయన పరిశ్రమలోని యూనిట్ 4లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదలో నైట్ షిప్ట్ లో పనిచేస్తున్న కార్మికులు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతిచెందాడు. ఇక మరో 13 మంది కార్మికులు తీవ్రంగా కాలిన గాయాలతో నూజివీడులోని ఏరియా ఆసుపత్రి కొందరు, విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మరికొందరు చికిత్స పొందుతున్నారు. వీరిలోనూ ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమంగానే వున్నట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలైన 13 మందిలో ఏడుగురు బీహార్ కు చెందిన వారు కాగా ఆరుగురు స్థానికులు వున్నారు.  అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే రసాయనాల కారణంగా మంటలు ఎగసిపడుతుండటంతో ఫైర్ సిబ్బందికి కూడా అదుపుచేయడం కష్టతరంగా మారింది. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్‌ బృందం సహాయక చర్యలు చేపట్టింది.