
మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్మల కార్యకర్తలతో మాట్లాడుతూ.. మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అయితే మనం పార్టీలో ఉన్నందున ఎక్కడ తొందర పడవద్దని సూచించారు. చెప్పారు. తాను పదవిలో ఉన్నప్పుడు ప్రతి పక్ష పార్టీలకు సంబంధించిన వారిపై కూడా ఎటువంటి వివక్షత చూపించలేదని చెప్పారు. ఇప్పుడు సొంత పార్టీ వారికే వేధింపులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లర వ్యక్తులను పట్టించుకోవద్దని అన్నారు. రాజకీయాల్లో కావలసింది ఓపిక అని అన్నారు. ఓపిక పడితే కార్యకర్తలే రాజులు అవుతారని చెప్పారు.
‘మనల్ని ఇబ్బందిపెట్టేవారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తుల గురించి పట్టించుకుంటే.. మనకున్న పరువు, ప్రతిష్టలే దిగజారిపోతాయి. కాబట్టి మన పనేదో మనం చేసుకోవాలి. నమ్ముకున్న ప్రజల కోసం పని చేయాలి. భగవంతుడు ఇచ్చిన అవకాశాల మేరకు జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు చేసే అవకాశాలు చేసే అదృష్టం దక్కింది.
భవిష్యత్తులో కూడా అదే పంథాను కొనసాగిస్తున్నారు. కక్షలు, కార్పణ్యాలు లేకుండా ఉంటాను. నేను పదవిలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు పార్టీలపై ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. సొంత పార్టీ వాళ్లనే ఈ రకంగా చేస్తున్నారంటే.. దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేద్దాం. కొద్ది రోజులు ఓపిక పట్టండి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. నేను మీ కోసం ఉంటానని చెప్పారు.
మనతోని ఉండే వ్యక్తులను ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో అందరూ చూస్తున్నారు. మనం పార్టీలో ఉన్నాం కాబట్టి దాన్ని బజారున పడేసే ఉద్దేశం మనకు లేదు. అటువంటి వ్యక్తులకు భవిష్యతులో పార్టీ ఏ రకమైన ఆదేశాలు ఇస్తుందో చూద్దాం. మనం ఎక్కడా కూడా తొందరకపడకుండా.. వాళ్లు కవ్వించినా, బాధపెట్టిన పట్టించుకోవద్దు. మీరు ఎవరినా కూడా ఇబ్బంది పెట్టొద్దు’అని తుమ్మల కార్యకర్తలను కోరారు.