635 గదులు, 30 సమావేశ మందిరాలు, 34 గుమ్మటాలు : తెలంగాణ నూతన సచివాలయంలో ప్రతీది ప్రత్యేకమే

By Siva Kodati  |  First Published Apr 29, 2023, 8:47 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దీని నిర్మాణానికి సంబంధించి ప్రతీ అంశమూ ప్రత్యేకమే. 


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ సచివాలయంలో ఎన్నో ప్రత్యేకతలు వున్నాయి. అవేంటో ఒకసారి చూస్తే : రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరుచూ పై కప్పు పెచ్చులు ఊడిపడటం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలు తలెత్తడం, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం , శాఖల మధ్య సమన్వయ లోపం వంటి  సమస్యల నేపథ్యంలో కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. 

ఇందుకోసం పాత సచివాలయం తొలగింపు – నూతన సచివాలయం ఏర్పాటు కోసం ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లతో ఒక నిపుణుల కమిటిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేసి పలు లోపాలను గుర్తించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నివేదిక ఇచ్చింది. దీంతో 2019 జూన్ 27న కొత్త సచివాలయం భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమిపూజ చేశారు. నూతన సచివాలయ నిర్మాణానికి డాక్టర్ ఆస్కార్, పొన్ని కాన్సెస్సావో అనే ప్రఖ్యాత ఆర్కిటెక్టులు డిజైనర్లుగా వ్యవహరించారు. ప్రస్తుత నమూనాతో నూతన సచివాలయం నిర్మాణానికి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. అనంతరం షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ సచివాలయన్ని నిర్మించే కాంట్రాక్టును దక్కించుకుంది. 

Latest Videos

నిజామాబాదులోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదాల్లోని శైలులు-అక్కడి గోపురాలు, గుజరాత్‌లోని సారంగాపూర్ లో ఉన్న హనుమాన్ దేవాలయ శైలుల ఆధారంగానే సచివాలయం గుమ్మటాల నిర్మాణాలు జరిగాయి. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్ లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. నూతన సచివాలయానికి తూర్పున లుంబినీవనం, అమరజ్యోతి.. పశ్చిమాన మింట్ కాంపాండ్, ఉత్తరాన అంబేద్కర్ విగ్రహం, దక్షిణాన రవీంద్రభారతి వెళ్లే రోడ్లు వున్నాయి.

నూతన సచివాలయం నిర్మాణం – ప్రత్యేకతలు 

  • దేశంలోని అతిపెద్ద సచివాలయాల్లో ఇదీ ఒకటి
  • భవనం పైన ఏర్పాటుచేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు.
  • సచివాలయంలోకి ప్రవేశానికి స్మార్ట్ కార్డ్ తో కూడిన పాస్‌లు
  • డోమ్‌లు, పిల్లర్ల నిర్మాణం కోసం గాల్వనైజ్డ్ రీఇన్ఫోర్స్ కాంక్రీట్ (జీఆర్ సీ) టెక్నాలజీని వినియోగించారు.
  • 1000 లారీల రెడ్ శాండ్ స్టోన్ వినియోగం
  • ఆరు అంతస్తులలో మొత్తం 635 గదులు 
  • సచివాలయం ముందువైపు రెండు బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఏటీఎమ్ సెంటర్లు, రైల్వే కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్ ఉన్నాయి
  • దేశంలోని చారిత్రక కట్టడాల కన్నా దీని ఎత్తు ఎక్కువ
  • 635 గదులు.. 30 సమావేశ మందిరాలు.. 34 గుమ్మటాలు

మహాద్వారం 
29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో బాహుబలి మహాద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాదు అడవుల్లోని టేకు కలపతో నాగపూర్ లో ఈ మహాద్వారాన్ని తయారుచేశారు. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయ ప్రాంగణంలో తలుపులన్నింటినీ టేకుతోనే తయారు చేశారు.

డోమ్ ల ఏర్పాటు
సచివాలయ భవనంపైన నాలుగు రకాలైన 34 డోమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ డోమ్‌లను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించారు. ‘ఏ’ టైప్‌ డోమ్‌ 23.6 ఫీట్లు, ‘బీ’ తరహా డోమ్‌లు 31 ఫీట్లు, ‘సీ’ టైప్‌ 21.6 ఫీట్లు, ‘డీ’ తరహా డోమ్‌లు అన్నిటికంటే పెద్దవి 54.8 ఫీట్లు ఉంటాయి. ఈ డోమ్‌ల నిర్మాణానికి 90 టన్నుల వరకు ఐరన్‌ ఉపయోగించినట్లు అంచనా

బాహుబలి డోమ్స్‌
తాజ్‌ మహల్, గుల్బర్గా గుంబజ్‌ వంటి కట్టడాల్లో భారీ డోమ్స్ (గుమ్మటాలు) నిర్మించినట్టుగా రాష్ట్ర సచివాలయంలో రెండు భారీ డోమ్స్ నిర్మించారు. 34 గుమ్మటాలు, జాతీయ చిహ్నమైన సింహాల బొమ్మలు కొత్త సచివాలయానికి మకుటాల్లా నిలిచాయి. 165 అడుగుల ఎత్తున ప్రధాన గుమ్మటాన్ని నిర్మించారు. ఇలా సచివాలయానికి ముందు, వెనుక ప్రధాన గుమ్మటాలను నిర్మించారు. ఆధునిక నిర్మాణాల్లో, అందులోనూ ప్రభుత్వ భవనాల్లో ఇలా భారీ డోమ్స్ రూపొందించడం ఇదే తొలిసారి. ఒక్కో డోమ్ 82 అడుగులు ఎత్తు (దాదాపు ఎనిమిది అంతస్తులు), 52 అడుగుల వ్యాసం కలిగి ఉంది. ఇవి సచివాలయ భవనానికి ప్రధాన ఆకర్షణగా, సచివాలయ భవనం డిజైన్‌ ప్రకారం తూర్పు, పశ్చిమ భాగాల్లో భవనంపై ఉన్నాయి. డోమ్‌ల లోపలి భాగాన్ని స్కైలాంజ్‌ తరహాలో రూపొందించారు. ఇందులోని విశాలమైన కిటికీల నుండి చుట్టూ నగరాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. 

జాతీయ చిహ్నం
ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటుచేశారు. 5 అడుగుల ఎత్తు, 2.5 టన్నుల బరువుండే జాతీయ చిహ్నాలను ఢిల్లీలో తయారు చేయించి తీసుకువచ్చారు.

మినీ రిజర్వాయర్
నీటిని పొదుపు చేసే ఉద్దేశంతో సచివాలయ భవనం భూగర్భంలో రెండున్నర లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వచ్చే వాన నీటిని రిజర్వాయర్ లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 9 ఎకరాల పచ్చిక బయళ్ళ నిర్వహణకు ఈ రిజర్వాయర్ లోని నీటినే వినియోగిస్తారు. 

ఫౌంటెన్లు
పార్లమెంటులో ఉన్న మాదిరిగానే అదే ఎత్తు, అదే వైశాల్యంతో (28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వైశాల్యం) సచివాలయంలో ముందు భాగంలో రెడ్‌శాండ్‌ స్టోన్‌తో రెండు ఫౌంటెయిన్లు ఏర్పాటు చేశారు.

సచివాలయ నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి
•    ఉక్కు: 8,000 మెట్రిక్ టన్నులు
•    సిమెంటు: 40,,000 మెట్రిక్ టన్నులు
•    ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు)
•    కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు
•    ఇటుకలు: 11 లక్షలు
•    ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు 
•    గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు
•    మార్బుల్: లక్ష చదరపు అడుగులు
•    ధోల్ పూర్ రెడ్ స్టోన్: 3,500 ఘనపు మీటర్లు
•    కలప: 7,500 ఘనపుటడుగులు
•    పనిచేసిన కార్మికులు: మూడు షిప్టుల్లో 12,000 మంది

ప్రతిష్టాత్మక ఐజిబిసి గుర్తింపు
ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) నుంచి గోల్డెన్ సర్టిఫికెట్ పొందిన ఏకైక సచివాలయం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. 
 

click me!