సాధారణ రైతు కుటుంబంలో పుట్టి... అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగి... ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే స్థాయికి చేరుకున్నారు అనుముల రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ : మారుమూల గ్రామానికి చెందిన యువకుడికి రాజకీయాలంటే ఇష్టం. దీంతో విద్యార్థి దశనుండే రాజకీయాలు ప్రారంభించాడు. బిజెపి అనుబంధ విద్యార్థి విభాగం ఏబివిపి కార్యకర్తగా ప్రారంభమైన అతడి రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు చేరింది. ఎన్నో ఒడిదుడుకులు... మరెన్నో సవాళ్లను అధిగమించి ఎట్టకేలకు పట్టుదలతో అనుకున్నది సాధించాడు. ఇలా తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన అనుముల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్ధానంలో చాలా ఆసక్తికర విషయాలున్నాయి.
రేవంత్ బాల్యం :
ఉమ్మడి మహబూబ్ నగర్ నేటి నాగర్ కర్నూల్ జిల్లాలోని మారుమూలు గ్రామం కొండారెడ్డిపల్లెలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రేవంత్ రెడ్డి. నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు నవంబర్ 8, 1968 న రేవంత్ జన్మించారు. ఈ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానం కాగా రేవంత్ నాలుగోవాడు. రేవంత్ బాల్యమంతా సొంతూళ్లోనే గడిచిపోయింది.
విద్యాభ్యాసం :
రేవంత్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం కొండారెడ్డిపల్లెలోనే సాగింది. పదో తరగతి తర్వాత వనపర్తిలో పాలిటెక్నిక్ పూర్తిచేసారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఏవి కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బిఏ) పూర్తిచేసారు. ఈ సమయంలోనే రాజకీయాలపై ఆసక్తి కలగడంతో ఏబివిపి కార్యకర్తగా పనిచేసారు.
రాజకీయ జీవితం :
తండ్రి సాధారణ రైతు... రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని కుటుంబం. బంధువులు, స్నేహితులు కాదు కనీసం తెలిసిన రాజకీయ నాయకులూ లేరు. కానీ అతడికి రాజకీయాలపై వున్న మక్కువే అటువైపు నడిపించింది. బిజెపి అనుబంధ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబివిపి) కార్యకర్తగా పనిచేసారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంకోసం తన పదవిని, టిడిపి పార్టీని వీడిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టడంతో రేవంత్ ఆ పార్టీలో చేరిపోయారు. 2002 లో ఆనాటి టిఆర్ఎస్ నేటి బిఆర్ఎస్ లో చేరారు రేవంత్. ఆ పార్టీలో తగిన గుర్తింపు దక్కకపోవడంతో దూరమయ్యాడు.
Revanth Reddy: పడిలేచిన కెరటంలా.. అనుముల రేవంత్ రెడ్డి..
ఇక 2006 లో రేవంత్ రాజకీయ జీవితంలో కీలక అడుగు పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మిడ్జిల్ జడ్పిటిసి స్థానానికి పోటీచేసారు. తన స్వస్ధలం కాదు... ఏ రాజకీయ పార్టీ అండ లేదు... స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి జడ్పిటిసిగా గెలుపొందారు. ఇదే రేవంత్ పొలిటికల్ కెరీర్ లో కీలక మలుపు. ఈ విజయం ఇచ్చిన ఊపుతోనే అంచెలంచెలుగా ఎదిగి నేడు ఏకంగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించే స్థాయికి చేరుకున్నారు రేవంత్.
జడ్పిటిసిగా గెలిచిన ఊపులోనే రేవంత్ మరో ముందడుగు వేసారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ జరగడంతో రేవంత్ బరిలోకి దిగారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తుచేసి 100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్సీ విజయంతో ఒక్కసారిగా రేవంత్ పేరు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డారు. ఇది రేవంత్ రాజకీయ జీవితంలో మరో మలుపు అని చెప్పుకోవచ్చు.
2008 లో ఆనాటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో చేరారు రేవంత్ చేరారు. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ను కొడంగల్ నుండి బరిలోకి దింపింది టిడిపి. మొదటి ప్రయత్నంలోనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురనాథ్ రెడ్డిపై 6,889 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీలో పదునైన మాటలు, విషయ పరిజ్ఞానంతో సీనియర్లను సైతం ఆకట్టుకున్నారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ టిడిపిలో కీలక నాయకుడిగా మారిపోయారు.
టిపిసిసి అధ్యక్షుడి నుండి ముఖ్యమంత్రి వరకు :
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కొంతకాలం టిడిపిలోనే కొనసాగారు రేవంత్. కానీ రాష్ట్రంలో టిడిపి బలహీనపడటంతో కాంగ్రెస్ లో చేరారు. అప్పటికి కాంగ్రెస్ కూడా బలహీనంగానే వుంది... కానీ ఎప్పుడయితే రేవంత్ కు పిసిసి పగ్గాలు అప్పగించారో పార్టీలో ఊపు తెచ్చారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ నేరుగా కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై పోరాటం చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకున్నాడు. సీనియర్లు తనకు సహకరించకున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగారు.
Read More Revanth Reddy: రేవంత్ రెడ్డి జర్నలిస్టు అవతారం.. అసలు ఆ పత్రికలో ఎందుకు చేరాడు?
ఓ వైపు రాష్ట్రంలో అధికార పార్టీ బిఆర్ఎస్, మరోవైపు కేంద్రంలో అధికార పార్టీ బిజెపి... ఈ రెండు పార్టీలను తట్టుకుని కాంగ్రెస్ నిలవడం కష్టమని అందరూ భావించారు. కానీ అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం చేయగలిగారు రేవంత్. సరిగ్గా 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఊపు తెచ్చి లీడర్లను, క్యాడర్ ను సంసిద్దం చేసాడు. తన వ్యూహాలతో బిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రాగలిగాడు. ఇలా పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ అదిష్టానం కూడా పట్టంకట్టింది. తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.