
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ అత్యాచారం (amnesia pub rape case) వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka) స్పందించారు. హైదరాబాద్ డ్రగ్స్‌కు (drugs) అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ సాధించింది మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడానికి కాదని.. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తోందని భట్టి విమర్శించారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ దర్యాప్తును ఎందుకు ఆలస్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని.. హోంమంత్రి మహమూద్ అలీని (mahmood ali) కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ మహిళా నేతలను ఎందుకు అడ్డుకున్నారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
నేరాలు ఒక్క హైదరాబాద్‌కు పరిమితం కాలేదని.. రాష్ట్రమంతటా విస్తరించాయని ఆయన వ్యాఖ్యానించారు. అధికారులపై ఒత్తిడి కారణంగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని భట్టి ఆరోపించారు. మంథనిలో హత్యకు గురైన వామనరావు కేసును (vaman rao lawyer) సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరామని.. కానీ ఆ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని విక్రమార్క దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని కేసీఆర్ (kcr) కుటుంబం నడుపుతోందని.. కల్వకుంట్ల కుటుంబం చెబితే తప్ప మంత్రులు సైతం స్పందించడం లేదని భట్టి చురకలు వేశారు.
అంతకుముందు అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. "తాను, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రాణాలు కోల్పోయినా పోరాటాన్ని విరమించబోము.. తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి కాపాడుతాం" అని పేర్కొన్నారు.
Also Read:అమ్నేషియా పబ్‌లో కార్పోరేట్ స్కూల్ ఫేర్‌వెల్ పార్టీ.. ఆ 150 మంది ఎవరు, బుకింగ్ ఎవరి పని..?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు ఎన్నారైల మద్దతు అవసరమన్నారు. తెలంగాణకు చెందిన పలువురు ఎన్నారైలు తమ జీవితాల్లో ఎన్నో విజయాలు సాధించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన ఎన్నారైలు అమెరికా అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఎన్నారైలు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (టిడిఎఫ్) ఏర్పాటు చేసి రాష్ట్ర ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతో మంది యువకులు, విద్యార్థులు తమ జీవితాలను త్యాగం చేశారని, యువత, విద్యార్థుల త్యాగాలను చూసి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఎన్నారైలకు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ అనేక రాజకీయ పార్టీలను ఒప్పించిందని రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమ పార్టీని గెలిపించి పార్టీని గెలిపించి సోనియా గాంధీకి కానుకగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్ర ఏర్పాటు ప్రధాన లక్ష్యాలు నెరవేరడం లేదన్నారు. ఖమ్మంలో ఓ యువకుడు నడుస్తున్న రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనను రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ, తెలంగాణలో ప్రతిరోజూ ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను రక్షించేందుకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌తో పాటు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. పల్లెల నుంచి వచ్చిన తెలంగాణ నిపుణులు అమెరికా కంపెనీల్లో ఉన్నత స్థానాలకు ఎదగడం చూసి తాము సంతోషంగా ఉన్నామని రేవంత్ అన్నారు.