మేడ్చల్ దగ్గర లారీని ఢీకొన్న కారు, ముగ్గురు మృతి, ఇద్దరి పరిస్తితి విషమం..

By SumaBala Bukka  |  First Published Nov 1, 2022, 8:37 AM IST

మేడ్చల్ దగ్గర ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. 


హైదరాబాద్ : అతివేగం, నిద్రమత్తులకు మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్ద జరిగిన ఘోర ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది. 12 మందితో శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న టాటా వింగర్ వాహనం..  ముందు వెళుతున్న లారీని వేగంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. గాయాలపాలైన తొమ్మిది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన మాలె శంకర్ గుప్తా (46) కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం సెలవు కావడంతో శ్రీశైలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తనకు పరిచయమున్న నరసింహారెడ్డి కారును అద్దెకు తీసుకున్నారు. శంకర్ గుప్తా, తన భార్య సోదరి కుటుంబం,  బావమరిది సహా మొత్తం మూడు కుటుంబాలకు చెందిన 12 మంది కలిసి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీశైలం బయలుదేరారు.

Latest Videos

అక్కడ దర్శనం పూర్తి చేసుకుని కొంతసేపు సరదాగా గడిపిన తర్వాత సాయంత్రం ఐదు గంటల సమయంలో తిరుగు ప్రయాణం అయ్యారు.  ఔటర్ రింగ్రోడ్డు మీదుగా కండ్లకోయ జంక్షన్ దగ్గర టెంపరరీ టోల్ ప్లాజా వరకు చేరుకున్నారు. మరో గంటలో ఇంటికి చేరతామనగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్నలారీని వీరు ఉన్న వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో శంకర్ గుప్తా (46), తోడల్లుడు సురేష్ (48),  డ్రైవర్ నరసింహారెడ్డి (30) మృతి చెందారు. వేగంగా ఢీకొట్టడంతో వింగర్ వాహనం ముందుభాగం నుజ్జునుజ్జయింది. ముందు భాగంలో కూర్చున్న ఈ ముగ్గురి తలలకు బలమైన గాయాలయ్యాయి. వారు అక్కడికక్కడే మరణించారు.  

కుమారుడి వికృత చేష్టలు, తల్లిపై అనుచిత ప్రవర్తన.. తట్టుకోలేక హత్య చేయించిన తల్లిదండ్రులు...

డ్రైవరు కాళ్ళు కారు ముందుభాగంలో ఇరుక్కుపోయాయి. వాహనంలో ఉన్న ఇద్దరు మహిళలు రూప, సంధ్యల పరిస్థితి విషమంగా ఉంది.  మిగిలిన ఏడుగురికి చిన్నపాటి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

త్వరగా చేరుకోవాలనుకోవడమే..
డ్రైవర్ గా వచ్చిన నరసింహారెడ్డి తన వాహనాన్ని ఓ ప్రైవేటు కంపెనీకి అద్దెకు నడిపిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో తీర్థయాత్రకు తీసుకువచ్చాడు. తెల్లారితే సోమవారం మళ్ళీ విధులకు వెళ్లాలనే ఉద్దేశంతో వాహనాన్ని శ్రీశైలం నుంచి వేగంగా నడిపాడు. ఆదివారం తెల్లవారుజాము నుంచి దాదాపు ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరం వెళ్లి రావడంతో ఆయనకు విశ్రాంతి కూడా లేదు. అర్ధరాత్రి కావడంతో నిద్రమత్తు ముంచుకొచ్చింది. ఈ క్షణంలోనే ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.

click me!