తెలంగాణకు వర్ష సూచన.. నాలుగు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు

Published : Jun 05, 2022, 09:48 AM IST
తెలంగాణకు వర్ష సూచన.. నాలుగు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములతో కూడిన వానలు

సారాంశం

తెలంగాణలో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. కొన్నిచోట్ల ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం వాతావరణం కాసింత చల్లబడింది. అయితే మరో రెండు రోజులు తర్వాత వాతావరణం ఇంకా చల్లబడనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

తెలంగాణలో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. కొన్నిచోట్ల ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం వాతావరణం కాసింత చల్లబడింది. అయితే మరో రెండు రోజులు తర్వాత వాతావరణం ఇంకా చల్లబడనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శనివారం రాష్ట్రంలోని చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఖమ్మం, రామగుండంలలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. హైదరాబాద్‌లో 24.0 డిగ్రీల సెల్సియస్‌ల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

ఇదిలా ఉంటే ఆది, సోమ వారాల్లో కూడా ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. ఇక, ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు వాతావరణంలో పెద్దగా మార్పు ఉండదని పేర్కొంది. అయితే  కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. 

ఇక, నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతపవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయి. అయితే ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా భారత వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రుతుపవనాల సీజన్‌లో ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని India Meteorological Department తెలిపింది.

‘‘ఈ రుతుపవనాల సగటు వర్షపాతం దీర్ఘకాల సగటులో 103 శాతం ఉంటుందని అంచనా వేయబడింది’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర ఇటీవల విలేకరుల సమావేశంలో తెలిపారు. నైరుతి ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని.. దీర్ఘకాల సగటులో 99 శాతం మాత్రమే వానలు పడొచ్చని ఐఎండీ ఈ ఏడాది ఏప్రిల్‌లో చెప్పిన సంగతి తెలిపిందే. రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో ఐఎండీ అంచనాలను సవరించింది. ఇక, తెలంగాణ‌లోకి జూన్ 5 నుంచి 10వ తేదీ మ‌ధ్య‌లో నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?