ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు.
హైదరాబాద్ : ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలో వ్యబిచార దందా సాగిస్తున్నాయి కొన్ని ముఠాలు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి హైటెక్ పద్దతిలో విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇలా ఎవరికీ అనుమానం రాకుండా హోటల్స్ లో గెస్ట్ ల మాదిరిగా కలరింగ్ ఇస్తూ గలీజ్ దందా సాగిస్తున్న ఓ ముఠా తాజాగా హైదరాబాద్ పోలీసులకు చిక్కింది.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్యనగర్ లో ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో ఓ ముఠా వ్యభిచారం నిర్వహిస్తోంది. స్థానిక రాయల్ పామ్ హోటల్లో అతిథుల మాదిరిగా అమ్మాయిలను దించి విటులను వారి గదులకు పంపి వ్యభిచారం నిర్వహిస్తోంది ముఠా. ఇలా హోటల్లోని రెండు గదుల్లో అమ్మాయిలను వుంచి ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడుతూ గుట్టుగా దందా సాగిస్తున్నారు.
ఈ హైటెక్ వ్యభిచారంపై మాదాపూర్ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రాయల్ పామ్ హోటల్ పై దాడిచేసిన పోలీసులు రెండు గదుల్లో పంజాబ్, పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతులను గుర్తించారు. అయితే జార్ఖండ్ కు చెందిన నిర్వహకుడు విజయ్ కుమార్ తప్పించుకోగా అతడికి సహాకరిస్తున్న అలీవర్ డాంగ్ పట్టుబడ్డాడు. యువతులను రెస్యూ హోం కు తరలించిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసారు. ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువతులు పట్టుబడిన హోటల్ రూంలో కండోమ్స్, స్మార్ట్ ఫోన్లు, కొంత నగదు, ఓ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యభిచార ముఠాకు సహకరించిన హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.