మాజీ నక్సలైట్ నయీం చనిపోయి ఆరేళ్లు గడుస్తున్నా అతని కేసులో ఆస్తుల స్వాధీనం.. బాధితులకు తిరిగి అప్పగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ప్రక్రియకు గండి పడడంతో బాధితులు అయోమయంలో పడ్డారు.
హైదరాబాద్ : మాజీ నక్సలైట్, కరుడుగట్టిన నేరగాడు నయీం దోచుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకుని.. బాధితులకు తిరిగి ఇచ్చే ప్రక్రియకు గండి పడింది. బినామీ ఆస్తుల (నిరోధక) చట్టం కింద వాటిని స్వాధీనం చేసుకోవడం కుదరదని అడ్జ్యుడికేటింగ్ అథారిటీ తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతో దర్యాప్తు సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాయి. నయీం దందాలతో భూములు, ఇళ్ల స్థలాలు పోగొట్టుకున్న వేలమంది పరిస్థితి ఈ పరిణామంతో అగమ్యగోచరంగా మారింది. నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చి.. పోలీసులకు లొంగిపోయాక నయీం.. ఇంచుమించు సమాంతర సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
సెటిల్మెంట్లు, బెదిరింపులు, కిడ్నాప్ లు, హత్యలతో బెంబేలెత్తిస్తూ వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకున్నాడు. ప్రాణ భయంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారు. 2016 ఆగస్టు 8న షాద్నగర్ ఎన్కౌంటర్లు నయీం మరణించాక వారంతా పెద్దఎత్తున పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 250కి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం1019 ఎకరాల వ్యవసాయ భూములు, రెండు లక్షల గజాల ఇళ్ల స్థలాలు, 29 భవనాలను నయీం తన అనుచరులు, బంధువుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. దీంతో పోలీసులతో పాటు ఆదాయపన్ను శాఖ కూడా ఈ కేసులో రంగప్రవేశం చేసింది.
పూర్తైన నయీం అనుచరుడు శేషన్న కస్టడీ: చంచల్ గూడ జైలుకి తరలింపు
బినామీ ఆస్తుల చట్టం ప్రకారం నయీం ఆస్తుల స్వాధీనం ప్రక్రియ మొదలుపెట్టింది. రెండు దఫాలుగా ఆయా ఆస్తులను అటాచ్ మెంట్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. నయీం అనుచరులు, బంధువులకు తగిన ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ.. వందల ఎకరాల భూములు వారి పేరుతో ఉన్నాయని.. వాటిని కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత వారికి లేదని, వారంతా బినామీ లేనని అడ్జ్యుడికేటింగ్ అథారిటీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నయీం కుటుంబ సభ్యులు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇద్దరి వాదనలు విన్న న్యాయస్థానం నయీమ్ ఆస్తులపై బినామీ చట్టాన్ని ప్రయోగించడానికి కొట్టి వేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 2016 తర్వాత బదిలీ అయిన ఆస్తులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని పేర్కొన్నట్లు తెలిసింది. స్వాధీన ప్రక్రియ ప్రారంభించిన నయీం ఆస్తులన్నీ అంతకుముందే చేతులు మారినందున.. వాటిపై బినామీ చట్టాన్ని ప్రయోగించడం కుదరదని స్పష్టం చేసినట్లు సమాచారం. నయీం బలవంతంగా స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి బాధితులకు అప్పగిస్తానని ప్రభుత్వం గతంలో అనేక మార్లు చెప్పింది. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. నయీం దోచుకున్న ఆస్తులను బాధితులకు అందించే ప్రయత్నాలు ఆగవని ఓ పోలీసు ఉన్నతాధికారి స్పష్టం చేశారు.