డబ్బలు కోసం తల్లిదండ్రులను వేధిస్తూ.. తల్లితో అనుచితంగా ప్రవర్తించిన కొడుకును అంతమొందించాలనుకున్నారు తల్లిదండ్రులు. అందుకోసం సుపారీ ఇచ్చి హత్య చేయించారు.
సూర్యాపేట : కుమారుడి వికృత చేష్టలకు విసిగిపోయిన తల్లిదండ్రులు.. ఇలాంటి కొడుకు ఉన్నా లేకున్నా ఒకటే అని భావించారు. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్ వద్ద అక్టోబర్ 19న మూసీనదిలో గుర్తుతెలియని శవం లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హుజూర్నగర్ సిఐ రామలింగారెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. ఖమ్మంకు చెందిన క్షత్రియ రాంసింగ్, రాణిబాయి దంపతులకు కుమారుడు సాయినాథ్(26), కుమార్తె సంతానం.
రామ్ సింగ్ సత్తుపల్లిలో రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసిన సాయినాథ్ వ్యసనాలకు బానిస అయ్యాడు. నాలుగేళ్లుగా డబ్బుల కోసం తల్లిదండ్రులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అంతటితో ఆగక ఇటీవల తన తల్లిపట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఇది తల్లిదండ్రులకు మింగుడు పడలేదు. తమ కొడుకు కొరకరాని కొయ్యగా మారాడాని.. సమాజానికి భారం అయ్యాడని భావించారు. దీంతో కొడుకుని అంతమొందించాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నివాసం ఉంటున్న రాణిబాయి తమ్ముడు సత్యనారాయణ సింగ్ కు ఈ విషయం చెప్పారు. దీంతో సింగ్ తనకు తెలిసిన మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన ఆటోడ్రైవర్ రామావత్ రవిని ఆశ్రయించాడు. అదే తండాకు చెందిన పనుగోతు నాగరాజు, బూరుగు రాంబాబు, త్రిపురారం మండలం రాజేంద్రనగర్ కు చెందిన ధనావత్ సాయితో రూ.8 లక్షలకు హత్య చేసేందుకు రవి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్టోబర్ 18న సత్యనారాయణసింగ్, రవి కలిసి నల్గొండ జిల్లా కల్లేపల్లి లోని మైసమ్మ దగ్గర దావత్ చేసుకుందామని సాయినాథ్ ని తీసుకువెళ్లారు. అందరూ కలిసి మద్యం తాగి, సాయినాథ్ మెడకు ఉరి బిగించి చంపేశారు.
ఆ తరువాత సాయినాథ్ కారులోనే శవాన్ని తీసుకు వెళ్లి మూసీ నదిలో పడేశారు. మరుసటి రోజు శవం నదిలో తేలడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మీడియా ద్వారా విషయం తెలిసింది అంటూ మూడు రోజులకు తల్లిదండ్రులు వచ్చి శవాన్ని తీసుకు వెళ్లారు. సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించిన పోలీసులు హత్య జరిగిన రోజు శూన్యం పహాడ్ వద్ద కనిపించిన కారు.. మృతుడి తల్లిదండ్రులు తీసుకువచ్చిన కారు ఒకటేనని నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కొడుకును తామే చంపించినట్లు ఒప్పుకున్నారు. తల్లిదండ్రులు, మేనమామతో పాటు హత్యకు సహకరించిన నలుగురిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.